AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్‌ లాగే మీరూ మాఫీ చేయండి.. ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల డిమాండ్‌

ఏపీ సీఎం చంద్రబాబు ముందు కొత్త ప్రతిపాదన

(అమ్మన్యూస్, అమరావతి):
ఏపీలో ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వాన్ని, బీజేపీని టార్గెట్‌ చేస్తూ విమర్శలకు దిగుతున్న పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల కొత్త డిమాండ్‌ తెరపైకి తెచ్చారు. షర్మిల కొత్త డిమాండ్‌ ను సీఎం చంద్రబాబు ముందుపెట్టారు. అంతే కాదు దీన్ని తెలంగాణ ప్రభుత్వంలో లింక్‌ చేస్తూ శుక్రవారం ఎక్స్‌ లో ఓ పోస్టు పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా రైతులకు లక్ష రూపాయల చొప్పున రుణమాఫీ చేసింది. దీనిపై షర్మిల హర్షం వ్యక్తం చేశారు. 15 ఏళ్ల క్రితం, ఒకే దఫాలో దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసి అన్నదాత పట్ల ప్రేమ, వ్యవసాయం పట్ల నిబద్ధత చూపింది నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అని గుర్తుచేశారు. మళ్లీ తెలంగాణలోని రేవంత్‌ రెడ్డి గారి సారధ్యంలో సోనియా, రాహుల్‌ గాంధీ గారి ఆలోచన, ఆదర్శాలకు అనుగుణంగా అందించిన రైతు రుణమాఫీ గొప్ప చరిత్రాత్మకమని అన్నారు. రాహుల్‌ గాంధీ ఎన్నికల వేళ చేసిన వాగ్దానం సాకారమైన రోజని, తెలంగాణ సర్కారుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.

రైతుల తలసరి అప్పులో దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ లో రైతు రుణమాఫీ ఎందుకు చెయ్యరని ప్రశ్నించారు. ప్రతీ రైతు నెత్తిన 2.5 లక్షల రుణం కత్తిలా వేలాడుతోందని, గత దశాబ్దంలో అటు కరువు, తుఫానులు, ఇటు పూర్తికాని ప్రాజెక్టులు, సర్కారుల నిర్లక్ష్యం, వెరసి రాష్ట్ర వ్యవసాయం సర్వనాశనం అయిపోయిందన్నారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు నడుపుతున్న మీరు, కేంద్ర సాయంతో ఎందుకు రుణమాఫీ చేయకూడదని చంద్రబాబును ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఉంటే, రెండు లక్షల రూపాయల రుణమాఫీ, ఇచ్చిన మాట ప్రకారం కచ్చితంగా చేసి ఉండేదని గర్వంగా చెప్పగలమన్నారు. కాబట్టి రైతు రుణమాఫీ చేయాలని కూటమి సర్కారును కోరారు. ఇది ఛాయిస్‌ కాకూడదు, బాధ్యత అనుకోవాలని ట్యాగ్‌ లైన్‌ కూడా పెట్టారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10