AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నాయకులు పార్టీని వీడినా.. బీఆర్‌ఎస్‌కు బుల్లెట్ల వంటి కార్యకర్తలున్నారు : కేసీఆర్

తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యాన్ని సాధించిన.. అంతటి ఉదాత్తమైన లక్ష్యం కోసం ఎన్నో పదవులను త్యాగం చేసిన చరిత్ర మనది. తెలంగాణ సాధించిన ఘనత కన్నా నాకు సీఎం పదవి అనేది పెద్ద విషయం కాదు అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ పునరుద్ఘటించారు.

తనను కలిసేందుకు ఎర్రవెల్లి నివాసానికి వందలాదిగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. “తెలంగాణ సాధించేనాటికి మనది సమైక్యపాలనలో దిక్కు మొక్కు లేని పరిస్థితి. సాగునీరు తాగునీరు కరెంటు వంటి అనేక కీలక వసతులను కల్పించుకున్నాం. తీర్చిదిద్దుకున్నాం. పదేండ్ల అనతికాలంలోనే తెలంగాణలో అద్భుతమైన ప్రగతిని సాధించుకున్నాం. ఇటువంటి కీలక సమయంలో వచ్చిన ఎన్నికల్లో ప్రజలు ఊహించని తీర్పునిచ్చారు. కొన్ని కొన్ని సార్లు ఇట్లాంటి తమాషాలు జరుగుతుంటాయని చరిత్రలోకి వెళితే అర్థమౌద్ది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అలవిగాని హామీలను నమ్మి ప్రజలు అనూహ్యంగా మోసపోయారు. “పాలిచ్చే బర్రెను వొదిలి దున్నపోతును తెచ్చుకున్నట్టు అయింది” అని పల్లెల్లో ప్రజలు బాధపడుతున్నారు” అని కేసీఆర్ వివరించారు.

తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో దారి తప్పింది..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన అనేక పథకాలు తమకు అందట్లేవని ప్రజలు ఆందోళన చెందుతున్నారని కేసీఆర్ అన్నారు. సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, రైతు బంధు అందట్లేవన్నారు. తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరా సరిగా లేద‌న్నారు. ఇవన్నీ ప్రజల మనసుల్లో రికార్డ్ అవుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి దరికి తెచ్చిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రేస్ పాలనలో దారి తప్పిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఎటువంటి ఆందోళన చెందవద్దని కార్యకర్తలకు కేసీఆర్ భరోసా ఇచ్చారు.

బీఆర్ఎస్‌ను గద్దె మీద కూర్చుండ బెట్టే రోజు త్వరలోనే వ‌స్తుంది..
తెలంగాణ కోసం సాగిన మన 25 ఏండ్ల సుధీర్ఘ ప్రయాణం ఆగలేదు, అయిపోలేదు. నాడు ఎన్టీఆర్‌ని తిరిగి ఎట్లైతే ప్రజలు గద్దె మీద కూర్చోబెట్టారో అంతకన్నా గొప్పగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరిగి ఆదరిస్తారని.. అంతకంటే రెట్టింపు మద్దతుతో మనలను గద్దె మీద కూర్చుండ బెట్టే రోజు త్వరలోనే వస్తుందని కార్యకర్తల హర్షధ్వానాల నడుమ అధినేత ప్రకటించారు.

బీఆర్ఎస్ పార్టీకి బుల్లెట్ల వంటి కార్యకర్తలు
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రోజు రోజుకు దిగజారుతున్నదన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నిచ్చెన మెట్లు ఎక్కేది పోయి మొదటి దశలోనే మెట్లు దిగ జారుకుంటూ వస్తున్నదని విశ్లేశించారు. పార్టీ అనేది నాయకులను సృష్టిస్తదని, నాయకులు పార్టీలోకి వచ్చి పోతుంటారని కొంతమంది నాయకులు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి ఎటువంటి తేడా రాదని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి బుల్లెట్ల వంటి కార్యకర్తలున్నారని, వారినే నాయకులుగా తీర్చిదిద్దుకుందామని సందర్శకుల చప్పట్లు నడుమ ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ బీ ఫాం ఇచ్చి అవకాశమిస్తే ఎవరైనా సిపాయీలుగా తయారౌతారని కేసీఆర్ తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10