AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పాడి కౌశిక్‌రెడ్డిపై క్రిమినల్‌ కేసు.. కొత్త యాక్ట్‌లో కేసు నమోదైన తొలి ఎమ్మెల్యే..!

(అమ్మన్యూస్, కరీంనగర్‌):
దేశ వ్యాప్తంగా భారతీయ న్యాయ సంహిత అమల్లోకి వచ్చిన రెండో రోజే హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదైంది. కరీంనగర్‌ పోలీసులు ఆయనపై జీరో ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేశారు. కాగా, ఈ కొత్త చట్టం కింద ఓ ఎమ్మెల్యేపై క్రిమినల్‌ కేసు నమోదు కావటం దేశవ్యాప్తంగా ఇదే తొలిసారి కావటం గమనార్హం.

దేశ వ్యాప్తంగా భారతీయ న్యాయ సంహిత పేరుతో జులై 1 నుంచి కొత్త చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కౌశిక్‌ రెడ్డి తమ విధులకు ఆటంకం కలిగించారని కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే.. మంగళవారం (జులై 2) కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ సమావేశం నిర్వహించారు. జడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరైన హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి.. కరీంనగర్‌ జిల్లా విద్యాధికారిని (డీఈఓ)ని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేసారు. ప్రజా ప్రతినిధులను అవమానిస్తున్నారని ఆయన్ని వెంటనే సస్పెండ్‌ చేయాలని బీఆర్‌ఎస్‌ జెడ్పీటీసీ సభ్యులతో కలిసి సుమారు అరగంట పాటు నిరసన తెలిపారు. సభ్యులు ఎంతకీ కంట్రోల్‌ కాకపోవడంతో కలెక్టర్‌ పమేలా సత్పతి సమావేశం నుంచి లేచి వెళ్లిపోబోయారు.

అయితే కలెక్టర్‌ వెళ్లిపోతున్న సమయంలో ఆమెను అడ్డుకున్న కౌశిక్‌ రెడ్డి.. దళిత బంధు అంశంతో పాటు డీఈవో అంశంపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ బయటకు వెళ్లకుండా అడ్డుకోవడానికి మెట్లపై బైఠాయించారు. పోలీసులు, అధికారులు వారించినా వినిపించుకోలేదు. కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో జెడ్పీ సీఈవో ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జెడ్పీ సీఈవో ఫిర్యాదు మేరకు కౌశిక్‌ రెడ్డిపై పోలీసులు కొత్త చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10