AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు లోక్ సభ స్పీకర్ ఎన్నిక… పోటాపోటీగా ఎన్డీఏ.. ఇండియా కూటమి నేతల భేటీలు.. !

బుధవారం లోక్ సభ స్పీకర్ ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో అధికార బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ, విపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్ పార్టీల నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. దేశ పార్లమెంట్ చరిత్రలో తొలిసారి లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరుగనుండటంతో అధికార, విపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సంఖ్యాబలం అనుకూలంగా ఉన్నా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తన ఎన్డీఏ పక్ష ఎంపీలతో సమావేశం అయ్యారు. అధికార ఎన్డీఏ ఎంపీలంతా లోక్‌సభ స్పీకర్ ఎన్నికల్లో పాల్గొనేందుకు ఉదయం 10.30 గంటలకల్లా పార్లమెంట్ కు చేరుకోవాలని కోరారు.

ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో బలం పుంజుకున్న విపక్షం.. తమకు ప్రొటెం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పోస్టు ఇచ్చేందుకు నిరాకరించడంతో స్పీకర్ పదవికి పోటీ పెట్టాలని నిర్ణయించింది. తొలుత ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సభ్యుడు సురేష్‌కు ఇస్తారని ఇండియా బ్లాక్ తొలుత అంచనా వేసింది. అలాగే విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అంశాన్ని పరిశీలించడం లేదని అధికార పక్షం తేల్చి చెప్పింది.

ఈ నేపథ్యంలో స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు పది నిమిషాల ముందు మంగళవారం కాంగ్రెస్ నేత కే సురేష్ నామినేషన్ వేశారు. మరోవైపు 17వ లోక్ సభ స్పీకర్ గా పని చేసిన బీజేపీ ఎంపీ ఓం బిర్లాను మళ్లీ అధికార పక్షం ప్రతిపాదించింది. సంఖ్యాబలం రీత్యా విపక్షానికి అనుకూలంగా లేకున్నా, పార్లమెంట్ సమావేశానికి హాజరైన సభ్యుల్లో సాధారణ మెజారిటీతో స్పీకర్ ఎన్నికవుతారు. ఎన్డీఏ కూటమి 293, కాంగ్రెస్ సారధ్యంలోని ఇండియా బ్లాక్ కు 232 ఓట్లు వస్తాయని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా నిర్వహించిన సమావేశంలో బీహార్ నేతలు చిరాగ్ పాశ్వాన్, జీతన్ రామ్ మాంఝీ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు విపక్ష పార్టీలు తమ సభ్యులు గైర్హాజరు కాకుండా విప్ జారీ చేశాయి. చివరి ప్రయత్నంగా కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు.. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా సహకరించాలని విపక్షాలను కోరారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో విపక్ష నేతలు సమావేశం జరిగింది. తొలుత స్పీకర్ పదవికి పోటీచేసే అంశాన్ని తమకు చెప్పలేదని అభ్యంతరం చెప్పిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఈ సమావేశానికి హాజరైనట్లు సమాచారం. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీతోనూ విడిగా సమావేశం కావడం గమనార్హం.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10