AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

20 నుంచి సింగరేణి పరీక్షలకు సర్వం సిద్ధం

సింగ‌రేణి కాల‌రీస్‌లో ఈ నెల 20 నుంచి జ‌రుగ‌నున్న కంప్యూటర్ బేస్డు పరీక్షల‌కు స‌ర్వం సిద్ధ‌మైంది. మొత్తం 272 ఎక్స్టర్నల్ పోస్టుల భ‌ర్తీ కోసం నిర్వ‌హిస్తున్న ప‌రీక్ష‌ల‌కు 18,665 మంది అభ్య‌ర్థులు హాజ‌రు కానున్నారు. సింగ‌రేణి చ‌రిత్ర‌లో తొలిసారిగా కంప్యూటర్ బేస్డు పరీక్షలు నిర్వ‌హిస్తున్నారు. హైదరాబాద్ లో 12 కేంద్రాల్లో పకడ్బందీగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. పరీక్షకు ముందు, తర్వాత అభ్యర్థులు త‌మ‌ బయోమెట్రిక్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష ప్రారంభానికి అర్ధ‌ గంట ముందే పరీక్షా కేంద్రాల గేట్లు మూసి వేస్తార‌ని సింగ‌రేణి చైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఎన్ బ‌ల‌రామ్ ప్ర‌క‌టించారు. ఉద్యోగాలిప్పిస్తామ‌ని హామీలు ఇచ్చే మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు.

గత మార్చి నెల ఒక‌టో తేదీన సింగ‌రేణిలో మొత్తం 10 కేటగిరీలలో 272 ఎక్స్టర్నల్ పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. హైద‌రాబాద్ కేంద్రంగా ఈనెల 20, 21వ తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 18,665 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లను జారీ చేసినట్లు వెల్లడించారు. అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలన్న ఉద్దేశంతో సింగరేణి చరిత్రలో తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలను (సీబీటీ) నిర్వహిస్తున్నట్లు వివరించారు.

పోటీ పరీక్షల నిర్వహణలో విశేష అనుభవం ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈడీసీఐఎల్ వారి ఆధ్వర్యంలో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు బ‌ల‌రామ్ వెల్లడించారు. ఇందుకోసం హైదరాబాద్ జంట నగరాల్లో 12 పరీక్ష సెంటర్లలో ఈ పరీక్షలను నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే మోసగాళ్ల వలలో పడొద్దని, శ్రమను నమ్ముకొని పరీక్షలో విజయం సాధించాలని సూచించారు. ఎవరైనా మాయమాటలు చెప్పి మోసగించాలని చూస్తే వారి వివరాలను కంపెనీ విజిలెన్స్ విభాగం, పోలీసు శాఖ దృష్టికి తీసుకురావాలన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10