AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్‌జీఎఫ్ నిధులు రూ.1800 కోట్లు ఇవ్వండి.. ప్ర‌ధాని మోదీకి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్‌జీఎఫ్‌) కింద కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి 2019 వరకు అయిదేళ్ల‌లో తెలంగాణ‌కు రూ.2,250 కోట్లు కేటాయించింద‌ని ప్ర‌ధాన‌మంత్రి మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక్కో ఏడాదికి రూ.450 కోట్ల చొప్పున ఈ గ్రాంట్ మంజూరు చేశార‌ని, 2019-20, 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాల్లో బీఆర్‌జీఎఫ్ కింద తెలంగాణ‌కు రావ‌ల్సిన రూ.1,800 కోట్లు విడుదల చేయాలని ప్ర‌ధాన‌మంత్రి మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

రక్షణ శాఖ భూములు బదిలీ చేయండి…
రాజధాని హైదరాబాద్‌లో పెరిగిన ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్-కరీంనగర్ రహదారి, హైదరాబాద్- నాగ్‌పూర్ ర‌హ‌దారి (ఎన్‌హెచ్‌-44)పై ఎలివేటెడ్ కారిడార్ల నిర్మించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ప్ర‌ధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ రెండు కారిడార్ల నిర్మాణానికి అడ్డంకి లేకుండా మార్గమధ్యంలో రక్షణశాఖ పరిధిలో ఉన్న భూములను రాష్ట్ర ప్ర‌భుత్వానికి బ‌దిలీ చేయాల‌ని కోరారు. ఆ కారిడార్ల‌తో పాటు హైదరాబాద్ న‌గ‌రంలో రహదారుల విస్తరణ, రవాణా, ఇత‌ర‌ మౌలిక వ‌స‌తుల కల్పనకు కేంద్ర రక్షణ శాఖ పరిధిలో 2450 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని ప్ర‌ధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఆ భూములకు ప్రత్యామ్నాయంగా రావిరాల ప్రాంతంలో రీసెర్చ్ సెంటర్ ఇమరాత్ (RIC) కి లీజుకు ఇచ్చిన 2,462 ఎకరాల భూములను పూర్తిగా కేంద్రానికి అప్పగించేందుకు త‌మ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంద‌ని తెలిపారు.

బ‌య్యారంలో ఉక్కు క‌ర్మాగారం ఏర్పాటు చేయండి
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో మౌలిక వ‌స‌తుల అభివృద్ధికి బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింద‌ని ప్ర‌ధాన‌మంత్రి మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇప్పటికే సాధ్యాసాధ్యాల నివేదికలు సమర్పించాయ‌ని, వెంట‌నే ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్య‌మంత్రి కోరారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10