AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు 11 జిల్లాల్లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన సీఎస్‌

రాష్ట్రంలోని దాదాపు 11 జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలుంటాయని వాతావరణశాఖ హెచ్చరించిందని, ఈ క్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. రానున్న 24గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలున్నాయన్నారు. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో వరద పరిస్థితులు, పునరావాసం, సహాయక చర్యలపై సమీక్షించారు. డీజీపీ జితేందర్, విపత్తుల నిర్వహణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, ఫైర్ సర్వీసుల డీజీ నాగిరెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఈ టెలీకాన్ఫరెన్స్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక రూపొందించి.. ఆస్తి, ప్రాణనష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికు గత నాలుగైదు రోజులుగా వానలుపడుతున్నాయని, రానున్న భారీ వర్షాలతో పరిస్థితులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్నారు. పోలీస్‌, తదితరశాఖలతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే విషయం జిల్లా కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలన్నారు. స్వర్ణ, కడెం ప్రాజెక్టుల గేట్లను తెరవడంతో లోతట్లు ప్రాంతాల ప్రజలను సరక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్మల్ కలెక్టర్‌ను ఆదేశించారు. నిర్మల్‌ జిల్లాకు 31 సభ్యులు, నాలుగు బొట్లు ఉన్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని పంపుతున్నామని తెలిపారు.

ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి 20వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని.. నీటి పరిమాణం ఎక్కువైతే పరీవాహక ప్రాంతాల్లో ముందు జాగ్రత చర్యలను చేపట్టాలని సూచించారు. మహారాష్ట్ర పరీవాహక ప్రాంతం నుంచి వచ్చే వరద గురించి తెలుసుకొని జాగ్రత్తలు చేపట్టేందుకు మహారాష్ట్ర అధికారులతో కోఆర్డినేట్‌ చేసుకోవాలని సూచించారు. కల్వర్టులు, వాగుల వద్ద సంబంధితశాఖల అధికారులతో జాయింట్‌ టీమ్‌లను ఏర్పాటు చేసి నిఘా ఉంచాలని ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి ఏ రకమైన సహాయం కావాలన్నా తమను సంప్రదించాలని కలెక్టర్లను కోరారు. జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాలు చేసి 24గంటలు పని చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి క్రేన్‌లను సైతం సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10