AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు.. రూ. 5 వేల కోట్ల న‌ష్టం జ‌రిగింద‌న్న సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో రూ. 5 వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథ‌మిక అంచ‌నా వేస్తున్న‌ట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. త‌క్ష‌ణ‌మే కేంద్రం రూ. 2 వేల కోట్లు కేటాయించాల‌ని కోరామ‌ని పేర్కొన్నారు. జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి ప్రధాన మోదీని ఆహ్వానించామ‌ని సీఎం చెప్పారు.

ఖ‌మ్మం జిల్లాకు వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. సూర్యాపేట జిల్లాలో కాసేపు ఆగారు. జిల్లాలో జరిగిన పంట, ఆస్తి నష్టం వివరాల‌ను సీఎం అడిగి తెలుసుకున్నారు. సాగర్ ఎడమకాలువ తెగడం వల్ల జరిగిన పంట నష్టంపైన ముఖ్యమంత్రి ఆరా తీశారు. సూర్యాపేట జిల్లాలో 30 సెం.మీ. అతి భారీ వర్షం కురిసింద‌న్నారు. అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నార‌ని తెలిపారు. పంట, ఆస్తి నష్టం పైన అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. మంత్రులు, ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచామ‌న్నారు. ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నార‌ని సీఎం పేర్కొన్నారు.

ఖమ్మం, నల్లగొండ పరిస్థితి పైన ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీకి వివరించి సాయం కోరిన‌ట్లు సీఎం తెలిపారు. వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, పశువులు చనిపోతే రూ. 50 వేల సాయం, పంట నష్టం జరిగితే ప్రతి ఎకరానికి రూ. 10 వేల‌ సాయం, ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించారు.

సూర్యాపేట కలెక్టర్‌కు తక్షణ సాయంగా రూ. 5 కోట్లు కేటాయిస్తున్న‌ట్లు సీఎం పేర్కొన్నారు. పాఠశాల సెలవులపైన జిల్లా కలెక్టర్ల‌కు నిర్ణయాధికారం ఇచ్చామ‌న్నారు. వరద బాధితులకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ధన్యవాదాలు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చేందుకు పని చేయాలి. రాజకీయాలకు ఇది సమయం కాదు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10