AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఖమ్మంకు హైడ్రా.. రేవంత్‌ సంచలన నిర్ణయం

మాజీ మంత్రి పువ్వాడ ఆక్రమణల గుట్టు తేలుస్తాం
వరదలకు బీఆర్‌ఎస్సే కారణం అంటూ ఆగ్రహం

(అమ్మన్యూస్, ఖమ్మం):
ఖమ్మం పట్టణంలోనూ ‘హైడ్రా’ అమలు చేస్తామని, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ లోపభూయిష్టంగా జరిగిందని సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. అందుకే చెరువులు తెగిపోతున్నాయన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఖమ్మంలో విచ్చలవిడిగా భూములను ఆక్రమించి భవనాలు నిర్మించారన్నారు. మాజీ మంత్రి పువ్వాడ ఆక్రమణల గుట్టు తేలుస్తామన్నారు.

గత ప్రభుత్వ హయాంలో ఖమ్మం నగరంలో విచ్చలవిడిగా భూములను ఆక్రమించి భవనాలు నిర్మించారని సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించి త్వరలోనే సర్వే చేస్తామని ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ నేత మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఆక్రమణల గుట్టు కూడా తేల్చాల్సి ఉందని స్పష్టం చేశారు. ఈ రోజు ఖమ్మంలో పర్యటన సందర్భంగా వరదల తీవ్రతపై మీడియాతో సీఎం రేవంత్‌ చిట్‌ చాట్‌ చేశారు. ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయిలో 42 సెం.మీ వర్షపాతం నమోదైందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే నష్టం భారీగా వాటిల్లిందన్నారు.

మిషన్‌ కాకతీయ లోపభూయిష్టం..
గత ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ లోపభూయిష్టంగా జరిగిందని ఆరోపించారు. అందుకే చెరువులు తెగిపోతున్నాయన్నారు. మున్నేరు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణంపై ఇంజనీర్లతో చర్చిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరదల కారణంగా రూ.5,430 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సాయంగా 10 వేలు అందించాలని నిర్ణయించామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రాష్ట్రానికి సాయం అందించాలని ప్రధాని మోదీని కోరామన్నారు.

బీఆర్‌ఎస్‌ , బీజేపీపై ఫైర్‌
కేసీఆర్‌ కుటుంబం వద్ద రూ.2లక్షల కోట్లు ఉన్నాయని ఆరోపించారు రేవంత్‌ రెడ్డి. వారు ఒక రూ.2 వేల కోట్లు సీఎం సహాయనిధికి కేసీఆర్‌ విరాళం ఇవ్వొచ్చు కదా అని అన్నారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు చెల్లించాలని బీజేపీ ఎంపీ ఈటల డిమాండ్‌ చేస్తున్నారని అన్నారు. ఆ నిధులను కేంద్రం నుంచి ఈటలే తెప్పించాలన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10