AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాష్ట్ర‌మంతటా స‌మీకృత గురుకుల విద్యాల‌య క్యాంప‌స్‌లు.. సీఎం రేవంత్ స‌మీక్ష‌లో నిర్ణ‌యం

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలను అధునాతనంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలలను వేర్వేరు చోట్ల కాకుండా ఒకే ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ క్యాంపస్‌ల‌ను ఏర్పాటు చేయ‌డానికి శ్రీకారం చుట్టింది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఇంటిగ్రేటేడ్ క్యాంపస్‌లు నిర్మిస్తారు. తొలుత పైలెట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటేడ్ క్యాంపస్‌ల‌ను నిర్మిస్తారు. అటుపై దశల వారీగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ క్యాంపస్‌లు నిర్మిస్తారు.

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల‌ ఏర్పాటుపై ఆదివారం సాయంత్రం సీఎం నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఇంటిగ్రేటేడ్ క్యాంపస్‌ల‌ నిర్మాణానికి ఆర్కిటెక్చర్లు రూపొందించిన పలు నమూనాలను పరిశీలించారు. నాణ్యమైన విద్యా బోధనకు వీలుగా తరగతి గదులతో పాటు, విద్యార్థులకు అన్ని వసతులుండేలా అధునాతన భవనాలు నిర్మించాలని సూచించారు. అందుబాటులో ఉన్న స్థలాలకు అనుగుణంగా నమూనాలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఇంటర్నేషనల్‌ స్కూళ్ల‌కు ధీటుగా ఈ భవనాలు నిర్మించాలని ఆదేశించారు.

దాదాపు 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలోని ప్రాంగణంలో ఈ సమీకృత గురుకులాల సముదాయం ఏర్పాటు చేస్తారు. ఒకే చోట ఈ భవనాలు నిర్మించి మినీ ఎడ్యుకేషన్‌ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో విద్యార్థుల ప్రతిభా పాఠవాలతో పాటు పోటీ తత్వం పెరుగుతుందని, కుల, మత వివక్ష తొలిగిపోతుందని ప్రభుత్వం సంకల్పించింది. గురుకులాల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ మరింత సమర్థంగా నిర్వహించే వీలుంటుందని భావిస్తోంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10