AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చంద్రబాబుతో పోటీపడే అవకాశం వచ్చింది.. అభివృద్ధిలో దూసుకుపోతాం.. సీఎం రేవంత్ రెడ్డి

అభివృద్ధి సంక్షేమంలో పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తో పోటీ పడదామని, చంద్రబాబుతోనే పోటీ పడుతున్నట్లు పాలనను ముందుకు తీసుకు వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ 24వ వార్షికోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ ఎన్టీఆర్ ఆలోచనతో ఏర్పడ్డ ఈ ఆసుపత్రి 24ఏళ్లుగా కోట్లాది మందికి సేవలందించడం సంతోషమన్నారు.

పేదలకు సేవలందించే ఉద్దేశంతో ఆనాడు ఎన్టీఆర్ ఈ ఆసుపత్రి నిర్మాణానికి పూనుకున్నారని, ఎన్టీఆర్ ఆలోచనా విధానాలను కొనసాగించాలని చంద్రబాబు నాయుడు ఆసుపత్రిని పూర్తి చేసి పేదలకు సేవలు అందించేలా చేశారని రేవంత్ పేర్కొన్నారు. పేదలకు వైద్య సేవలు అందించాలన్న ఎన్టీఆర్ ఆలోచనలు అమలవుతున్న తీరు చూసి ఆయన మనల్ని స్వర్గం నుంచి ఆశీర్వదిస్తారన్నారు.

ఆసుపత్రికి సంబంధించి ఎలాంటి సహకారం కావాలన్నా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమంలో చంద్రబాబు నాయుడుతో పోటీ పడి పని చేసే అవకాశం నాకు వచ్చిందని, అభివృద్ధి, సంక్షేమంలో ప్రపంచానికి తెలుగు రాష్ట్రాలు ఆదర్శంగా నిలవాలన్నది మా అభిమతమన్నారు. తెలంగాణలో హెల్త్ టూరిజం హబ్ ను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం ఆలోచిస్తోందని, అన్ని రకాల వైద్య సేవలు అందేలా హెల్త్ టూరిజం హబ్ ఉంటుందన్నారు. వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ ను ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో బసవతారకం ఆసుపత్రికి చోటు ఖచ్చితంగా ఉంటుందన్నారు.

ప్రపంచ దేశాల నుంచి ఎవరైనా హైదరాబాద్ కు వస్తే అన్ని రకాల వైద్య సేవలు అందుతాయనేలా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. రాజకీయం, సంక్షేమం ఎన్టీఆర్ వారసత్వంగా ఇచ్చారని, ఎన్టీఆర్ మూడో తరం కూడా దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. క్యాన్సర్ అనే మహమ్మారిని రూపుమాపేందుకు వైద్యులు కృషి చేయాలని, క్యాన్సర్ అనే వ్యాధి ప్రస్తుతం ప్రపంచాన్ని గఢగఢలాడిస్తుందన్నారు. క్యాన్సర్ నిరోధక మందుల తయారీకి మరిన్ని పరిశోధనలపై కూడా దృష్టి పెడితే బాగుంటుందని సీఎం పేర్కొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10