AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్ రెడ్డికి మోడీ ఫోన్: అభినందించిన ప్రధాని

భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం రాత్రి ఫోన్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితులను, నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోడీ. భారీ వర్షం, వరదతో వాటిల్లిన నష్టాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తక్షణ సహాయక చర్యలను సీఎం రేవంత్ వివరించారు.

ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని ప్రధాని మోడీకి సీఎం రేవంత్ తెలిపారు. ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించినందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రధాని మోడీ అభినందించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సేవలు అందించే హెలికాప్టర్లను పంపిస్తామని ప్రధాని మోడీ సీఎంకు హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

వరదనీటిని వృథా చేయొద్దు:

సీఎం రేవంత్ భారీ వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వచ్చిన వరద నీటిని వృథా చేయకుండా భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకునేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు కుంటల్లో నీటిని నిల్వ చేయాలని సూచించారు. నిండిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. వచ్చిన వరద నీటిని వీలైనంత మేరకు లిఫ్ట్ చేయాలని, రోజుకు ఒక టీఎంసీ తగ్గకుండా డ్రా చేయాలని ఆదేశించారు. అలాగే, నంది, గాయత్రి పంప్ హౌస్‌ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపాలని ముఖ్యమంత్రి సూచించారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌తో పాటు రంగనాయక సాగర్‌, మల్లన్న సాగర్ వరకు జలాశయాల్లోకి ఏకధాటిగా నీటిని లిఫ్ట్ చేయాలని ఆదేశించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10