AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణకు భారీ వర్ష సూచన.. మూడు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ

తెలంగాణ కు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. మూడు రోజుల పాటు తెలంగాణకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. గంటకు 35 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మెహదీపట్నం, నాంపల్లి, మాసబ్ ట్యాంక్, ఉప్పల్, రామంతపూర్, సికింద్రాబాద్, బేగంపేట్‌, పంజాగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్, లకిడికపూల్‌లో వర్షం కురిసింది. దీంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది.

డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అనవసరంగా ఎవ్వరూ బయటకు రావద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ కాల్ సెంటర్లను కూడా ఓపెన్ చేసింది. వర్షాల కారణంగా ఇబ్బంది పడేవారు ఆయా నంబర్లకు కాల్ చేయాలని సూచించింది. జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ 040-21111111 లేదా డీఆర్ఎఫ్ సహాయం కోసం 9000113667 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్ట్ ఆనకట్టకు గండ్లు ఏర్పడ్డాయి. వరద నీరు బయటకు వెళ్ళడంతో ముంపు ప్రాంతాల్లో వరద ప్రభావం తగ్గింది. ముంపు గ్రామాలైన గుమ్మడివల్లి, రంగాపురం, కొత్తూరు బచ్చువారి గూడెంలో నిర్వాసితులను తరలించారు. వరద ఉధృతి తగ్గడంతో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఆనకట్ట మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. అశ్వారావుపేట మండలం నారాయణ పురం వద్ద వాగు వరద ఉధృతిలో చిక్కిన 30 మందిని ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి. సహాయ చర్యలపై ఎప్పటికపుడు మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహిస్తున్నారు. వాగు వద్ద క్షేత్ర స్థాయిలో ఉండి సహాయ చర్యల్లో జిల్లా కలెక్టర్ ఎస్పీ.. ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10