AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చంద్రబాబు లేఖకు రేవంత్ రెడ్డి రిప్లై.. లేఖలో ఇంట్రెస్టింగ్ విషయాలు

ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. చంద్రబాబుకు రిప్లై ఇస్తూ.. మరో లేఖ రాశారు. ఈ లేఖలో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. పదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాల గురించి చర్చించేందుకు సమావేశమవుదామంటూ చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు రేవంత్ రెడ్డి ఓకే చెప్పారు. ఈ మేరకు.. చంద్రబాబు నిర్ణయించిన తేదీ అయిన ఈ నెల 6న హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో భేటీకి ఆహ్వానిస్తున్నట్టు.. సీఎం రేవంత్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.

జులై ఒకటో తేదీన మీరు పంపించిన లేఖ అందింది. నా గురించి లేఖలో మీరు రాసిన మాటలకు కృతజ్ఞున్ని. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించినందుకు గానూ.. మీకు శుభాకాంక్షలు. నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి.. భారతదేశంలోని అరుదైన నేతల జాబితాలో చేరారు. ఈసారి సీఎంగా మీ ప్రయాణం గొప్పగా సాగాలని ఆకాంక్షిస్తున్నా. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ముఖాముఖి చర్చలు అవసరమని మీరు పెట్టిన ప్రతిపాధనకు పూర్తిగా ఏకీభవిస్తున్నా. అపరిష్కృతంగా ఉన్న విభజన హామీలను పరిష్కరించేందుకు, రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు పరస్పర సహాకారానికి ఇలాంటి చర్యలు ఎంతో అవసరం. నా తరపున, రాష్ట్ర ప్రజల తరపున.. చర్చలకు మిమల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.” అంటూ రేవంత్ రెడ్డి లేఖ రాశారు.

కాగా.. జులై ఒకటో తేదీన.. రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ రాసిన విషయం తెలిసిందే. తెలంగాణ సీఎంగా విశేష కృషి చేస్తున్నారని.. రేవంత్ రెడ్డిని చంద్రబాబు కొనియాడారు. తెలుగు మాట్లాడే రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సుస్థిరమైన పురోగతి, శ్రేయస్సు కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని.. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పురోగతికి సహకారం ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు. విభజన చట్టంలో ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండానే ఉన్నాయని.. వాటి పరిష్కారానికి ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందామంటూ చంద్రబాబు ప్రతిపాధించారు. అందుకు.. తానే హైదరాబాద్ వస్తానని.. తేదీ కూడా ఫిక్స్ చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10