AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అర్ధరాత్రి వేళ కేసీఆర్‌కు బిగ్‌ ఝలక్‌ – కాంగ్రెస్‌లోకి ఏకంగా ఆరుగురు ఎమ్మెల్సీలు..

బీఆర్‌ఎస్‌లో భారీ కుదుపు

– కాంగ్రెస్‌లోకి ఏకంగా ఆరుగురు ఎమ్మెల్సీలు..
– చేరిన వారిలో భాను ప్రసాద్, బస్వరాజ్‌ సారయ్య, దండె విఠల్, ఎం.ఎస్‌. ప్రభాకర్, యెగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్‌..
– ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు చేరిక
– ఎమ్మెల్సీల చేరికతో మండలిలో పెరిగిన హస్తం బలం
– రోజురోజుకు బలహీనపడుతున్న గులాబీ దళం

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
బీఆర్‌ఎస్‌ పార్టీ పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతోంది. పార్టీని వీడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు చేరగా, తాజాగా ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారు. గురువారం అర్ధరాత్రి వేళ కేసీఆర్‌కు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు భారీ ఝలక్‌ ఇచ్చారు. మరోవైపు పార్టీని కాపాడుకునేందుకు కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో క్యాడర్‌ డీలా పడిపోతోంది.

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలాపడ్డ కేసీఆర్‌కు.. నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు బీఆర్‌ఎస్‌ విలవిల్లాడుతోంది. కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్‌ వలసల పరంపర కొనసాగుతోంది. తాజాగా, బీఆర్‌ఎస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్సీలు భాను ప్రసాద్, బస్వరాజ్‌ సారయ్య, దండె విఠల్, ఎం.ఎస్‌. ప్రభాకర్, యెగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్‌ కాంగ్రెస్‌ కండువాలు కప్పుకున్నారు.

ఢిల్లీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాష్ట్రానికి రాగానే.. అర్ధరాత్రి ఆయన నివాసంలో వారంతా కాంగ్రెస్‌ పార్టీలో చేరడం గమనార్హం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ పాల్గొన్నారు. దండే విఠల్‌ –ఆదిలాబాద్‌ లోకల్‌ బాడీ, భాను ప్రసాద్‌ –కరీంనగర్‌ లోకల్‌ బాడీ, ఎమ్మెస్‌ ప్రభాకర్‌ –రంగారెడ్డి జిల్లా లోకల్‌ బాడీ.. బొగ్గవరపు దయానంద్‌– గవర్నర్‌ కోటా, ఎగ్గే మల్లేషం–ఎమ్మెల్యే కోటా, బస్వరాజ్‌ సారయ్య– గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. శుక్రవారం అమావాస్య కావడంతో గురువారం రాత్రే వీళ్లు కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్టు తెలుస్తోంది. వీరి చేరికతో మండలిలో కాంగ్రెస్‌ బలం 12కు చేరింది.

మరికొందరు కూడా..
ఇటీవలే మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు బీఆర్‌ఎస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరినట్లు అయింది. మరికొందరు కూడా బీఆర్‌ఎస్‌ను వీడుతారనే ప్రచారం జరుగుతోంది.

నేడో, రేపో ‘బండ్ల’..
మహబూబ్‌నగర్‌కు చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తల అభిప్రాయం మేరకు తన నిర్ణయం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కార్యకర్తల అభిప్రాయంతో చేరికపై నిర్ణయం తీసుకుంటానని బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. సీనియర్‌ నేత కే కేశవరావు కూడా బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10