AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మణుగూరులో టెన్షన్.. పౌరహక్కుల నేతల అరెస్ట్

ఈనెల 5న తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న కూడా ఉన్నాడు. ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన ఈ దళానికి లచ్చన్న నాయకత్వం వహించినట్టు పోలీసులు తెలిపారు. అతనిపై పలు పోలీస్ స్టేషన్లలో 50కి పైగా కేసులు ఉన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడగా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ ఎన్‌కౌంటర్‌పై పౌరహక్కుల నేతలు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో నిజనిర్ధారణ కోసం ఘటనా స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

శనివారం పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్, కార్యదర్శి నారాయణతో కలిసి 14 మంది రఘునాథపాలెం వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలిసి పోలీసులు అలర్ట్ అయ్యారు. వీరిని మణుగూరు దగ్గర ఆపి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వారిని అశ్వాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పీఎస్ గేట్‌కు తాళం వేశారు. మీడియాకు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. దీంతో పీఎస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎన్‌కౌంటర్‌పై నిజానిజాలు తెలుసుకునేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడంపై పౌర హక్కుల నేతలు మండిపడుతున్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ దీనిపై స్పందిస్తూ, 15 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగిందని, అక్కడ అసలేం జరిగిందో తెలుసుకునేందుకు వెళ్తున్న వారిని అడ్డుకోవడం కరెక్ట్ కాదన్నారు. నిజనిర్ధారణ అనేది 50 ఏళ్ల నుంచి జరుగుతున్నదేనని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఎన్‌కౌంటర్ జరగడం ఆశ్చర్యంగా ఉందన్నారు హరగోపాల్.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10