AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అనతికాలంలోనే ఆదర్శ పాలన అందించాం : కేసీఆర్‌

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా పాలనను అందించిందని బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. విద్యుత్‌, సాగునీరు, వ్యవసాయ తదితర రంగాల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యాచరణ దేశ చరిత్రలోనే ముందెన్నడూ లేని విధంగా కొనసాగిందని పేర్కొన్నారు. తెలంగాణ వ్యవసాయ ప్రగతిని చూసి మహారాష్ట్రవంటి పక్క రాష్ట్రాల ప్రజలు తమకూ కేసీఆర్ పాలన కావాలని కోరుకున్నారని తెలిపారు. ఖమ్మం, మహబూబాబాద్‌, వేములవాడ, నర్సాపూర్‌, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల నుంచి తనను కలిసేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలతో ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అన్నివర్గాలను కడుపులోపెట్టుకొని తెలంగాణను సకలం బాగుచేస్తున్న కేసీఆర్ పాలన పోతదనుకోలేదని, జరిగిన పొరపాటుకు తెలంగాణ సమాజం బాధపడుతున్నదని కార్యకర్తలు, అభిమానులు పేర్కొన్నారు.

ఎన్నికల ఫలితాలతో మహారాష్ట్ర ప్రజలు ఆవేదన చెందారు..
అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ నినాదంతో దేశంలో రైతు రాజ్యం తెచ్చుకోవాలని బీఆర్‌ఎస్‌తో కలిసి అడుగులేస్తూ ముందుకు కదిలిన మహారాష్ట్ర తదితర రాష్ట్రాల ప్రజలు మొన్నటి తెలంగాణ ఎన్నికల ఫలితాలతో తీవ్ర ఆవేదన చెందారన్నారు. కేసీఆర్ పాలన లేకపోవడంతో తెలంగాణ రైతుల కంటే మహారాష్ట్రతోపాటు దేశ రైతాంగమే తీవ్రంగా నష్టపోయిందని ఇటీవల తనను కలిసిన మహారాష్ట్ర నేతలు అన్నారని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమితో రైతు రాజ్యాన్ని అందించగల దమ్మున్న కేసీఆర్ దార్శనిక నాయకత్వాన్ని దేశం కోల్పోయిందని వారు బాధపడ్డారని తెలిపారు. నల్ల చట్టాలను తెచ్చి తమ జీవితాలను, తాము నమ్ముకున్న వ్యవసాయ రంగాన్ని ఆగం చేయాలని చూసిన గత బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ వీధుల్లో దేశ రైతాంగం శాంతియుత పోరాటం చేసిన సంగతిని కేసీఆర్ గుర్తుచేశారు. రైతుల మీద లాఠీఛార్జీ, కాల్పులు జరిపి 700 మంది రైతుల మరణానికి నాటి బీజేపీ సర్కార్ కారణమైందన్నారు.

అధైర్యపడొద్దని కార్యకర్తలకు భరోసా
దేశ రైతాంగ బాధలను తీర్చేందుకు నడుం కట్టిన బీఆర్ఎస్ కిసాన్ సర్కార్ నినాదంతో మహారాష్ట్ర నుంచి ఒక లైన్ తీసుకొని ముందుకు సాగిందని కేసీఆర్ వివరించారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రజల నుంచి అపూర్వస్పందన కానవచ్చిందన్నారు. తెలంగాణతో పాటు దేశ రైతాంగ ప్రగతికోసం బయలుదేరిన నేపథ్యంలో తెలంగాణ ప్రజల నిర్ణయం ఇతర రాష్ట్రాల రైతాంగాన్ని నిరుత్సాహపరిచిందని తెలిపారు. అయినా, ఏమాత్రం అధైర్యపడొద్దని కార్యకర్తలకు కేసీఆర్ భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణయమని స్పష్టం చేశారు. ‘ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు. ప్రతిపక్ష పాత్రకూడా శాశ్వతం కాదు. మనకు ప్రజాతీర్పే శిరోధార్యం. వారు ఎలాంటి పాత్రను అప్పగిస్తే దాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించాలి. అధికారం కోల్పోయామని బాధపడడం సరియైన రాజకీయ నాయకుని లక్షణం కాదు. ప్రజాసంక్షేమం కోసం కొనసాగే నిరంతర ప్రక్రియనే రాజకీయం. దానికి గెలుపు ఓటములతో సంబంధం ఉండదు. ప్రజల్లో కలిసివుంటూ వారి సమస్యలమీద నిరంతరం పోరాడుతూ వారి అభిమానాన్ని సాధించాలి’ అని కేసీఆర్ పునరుద్ఘటించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10