AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఖమ్మం.. ఎందుకిలా?.. వరద బీభత్సానికి అసలు కారణమేదీ?

ఒక్క రాత్రికే మురికి కూపంగా మారడమా..
వరద నీరు వెళ్లేదారి లేకనేనా..
ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్లలో అక్రమ కట్టడాలే కారణమా?

(అమ్మన్యూస్, ఖమ్మం):
నిన్న మొన్నటివరకు సుందరీకరణకు మారుపేరుగా ఉన్న ఖమ్మం నగరం ఒక్కరాత్రిలోనే మురికి కూపంగా మారింది. రెండు తెలుగురాష్ట్రాల రాకపోకలకు కేంద్రబిందువుగా ఉన్న జిల్లా కేంద్రం ఒక్కరోజు కురిసిన వర్షానికే జలదిగ్బంధం అయింది. నగర పాలక సంస్థ పరిధిలోని ఒకటి, రెండు డివిజన్లు మినహా మిగిలిన అన్నీ ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీళ్లు నిలిచి జనజీవనం స్తంభించింది…

వరద నీరు వెళ్లేదారి లేకనే..
ఖమ్మం అర్బన్‌ పరిధిలో శనివారం కురిసిన వర్షం కంటే కూడా పెద్దఎత్తున వర్షపాతం నమోదైన సంఘటనలు బోలెడున్నాయి. కానీ ఆయా సమయాల్లో ఎన్నడూ లేనివిధంగా నగర పాలక సంస్థ పరిధిలోని పదులకొద్దీ డివిజన్లు ముంపునకు ఎందుకు గురవుతున్నాయనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మున్నేరు బ్రిడ్జిలపై నుంచి నీళ్లు పొంగేస్థాయిలో వరద రావడం ఇది నాలుగోసారి కాగా, ఆ నాలుగుసార్లు కూడా ఇదే రకమైన పరిస్థితులు నెలకొనడంతోపాటు యేటికేడు వరద ముప్పు తీవ్రతరమవుతున్నట్టుగా తెలుస్తోంది. కాగా గతంలో అంతకుమించిన వర్షాలు పడిన సమయంలో కొద్దీగొప్ప నష్టం ఉన్నప్పటికీ ఇంతటిస్థాయిలో జననివాసాలు ముంపునకు గురవడం గడిచిన రెండేళ్ల కాలంగానే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

అంతా అతలాకుతలం..
ప్రస్తుతం కురిసిన వర్షాలతో ఖమ్మం నగరం అతలాకుతలమైన పరిస్థితులు నెలకొన్నాయి. వాస్తవానికి మున్నేరుకు వరద పెరిగిన సమయంలో మున్నేరు నదీ ప్రవాహానికి సమీపంలో ఉన్న ప్రాంతాలు మాత్రమే ప్రభావితమయ్యేవి. కానీ గతేడాది వర్షాలు కురిసిన సమయంలో ఖమ్మం నగరంలోని మరికొన్ని ప్రాంతాలకు వరద నీరు చేరుకుని ఇళ్లల్లో నీళ్లు నిలిచిపోయాయి. కాగా శనివారం కురిసిన వర్షాలకు మాత్రం ఖమ్మం నగరం మొత్తం వరదనీటితో నిండిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మున్నేరు నదీ ప్రవాహానికి చేరువలో ఉన్న దానవాయిగూడెం, రామన్నపేట, మోతీనగర్, వెంకటేశ్వరనగర్, రంగనాయకులగుట్ట, ప్రకాష్‌నగర్, బొక్కలగడ్డ, పద్మావతినగర్‌ ప్రాంతాలు పూర్తిగా నీటమునిగిపోయాయి. ఆయా ప్రాంతాల్లో రెండు, మూడు ఫ్లోర్లు ఇళ్లు మొత్తం కనిపించని పరిస్థితి ఏర్పడింది.

ఇదే అసలు కారణం..
వాటన్నింటికీ కారణంగా మున్నేరు తీవ్రంగా ప్రవహించడంతో వరదనీరు కలిసే అవకాశం లేని కారణాన్ని కొందరు చెబుతున్నప్పటికీ.. ఎగువనుంచి ఎగబాకిన వరదనీరు వెళ్లేదారిలేకపోవడంతో దిగువన ఉన్న ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రఘునాథపాలెం నుంచి బల్లేపల్లి, పాండురంగాపురం, అమరావతినగర్, విద్యానగర్‌ నుంచి వచ్చే వరదనీరు మొత్తం ఖానాపురం చెరువుమీదుగా లకారం మీదుగా మున్నేరులో కలవాల్సి ఉంటుంది. మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు సైతం ఇదేరీతిలో బయటకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ దారులన్నీ మూసివేసిన కారణంగా ఎక్కడి నీరు అక్కడే నిలిచి ఇళ్లకు ఎగబాకినట్టు తెలుస్తోంది. అయితే ఇంతటిస్థాయిలో నష్టం జరగడానికి కారణం సుందరీకరణ పేరుతో పార్కులు ఏర్పాటు చేసి వరద వెళ్లేందుకు దారిలేకుండా అడ్డుకట్ట వేయడం కూడా కారణమేనంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

డ్రెయినేజీలు మూసేసి..
మున్నేరు పరివాహక ప్రాంతంలోని బఫర్‌జోన్‌ లో, ఎఫ్‌టీఎల్‌లలో జోరుగా భవంతులు నిర్మాణాలు జరగ్గా.. నగరంలో సైతం అదేరీతిలో కాల్వలను కబ్జాచేసి మరీ నిర్మాణాలు చేపట్టారు. భారీ ఎత్తున అపార్ట్‌మెంట్లు నిర్మించారు. పలు అపార్ట్‌మెంట్లలో అండర్‌గ్రౌండ్‌ పేరుతో లోపలికి వెళ్లిన వరదనీరు బయటకు వెళ్లే అవకాశం లేకుండా సెల్లార్లు నిర్మించారు. డ్రెయినేజీలను ఆక్రమించి రోడ్లపైకి నిర్మాణాలు చేశారు. పెద్ద ఎత్తున ర్యాంపులు వేసి డ్రెయినేజీలు మూసేశారు. కొన్ని ప్రాంతాల్లో అయితే మాస్టర్‌ప్లాన్‌ లో బఫర్‌జోన్‌ లో ఉన్న స్థలాలకు సైతం లోకేషన్లు మార్చి అనుమతులు మంజూరు చేసిన సంఘటనలు ఖమ్మం కార్పొరేషన్‌ లో ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉండటంతోపాటు మిగిలిన వరదనీరు సైతం బయటకు వెళ్లేందుకు మార్గం లేక కట్టలు కట్టిన కారణంగా ఆయా డివిజన్లలో నీళ్లు నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది.

బురదమయమైన బతుకులు
మున్నేరు పరీవాహక ప్రాంత ప్రజలకు ఏటా కన్నీటి కష్టాలు తప్పడం లేదు. భారీ వర్షాలు వరదల సమయంలో ముంచుకొస్తున్న ముప్పు గురిం చి అధికార యంత్రాంగంతో పాటుగా తాము ఓట్లేసి గెలిపించిన ప్రజా ప్రతినిధులు కూడా కనీసం పది నిమిషాల ముందు కూడా సమాచారం ఇవ్వలేదని బాధితులు కన్నీరు పెట్టారు. ఆకస్మికంగా ఇంటిని చుట్టు ము ట్టిన వరదతో పిల్లలతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఇంటి నుంచి బ య పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవ త్సరం కూడా వరద వచ్చినా ఇంత స్థాయిలో నష్టం జరగ లేదన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10