AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భద్రాచలం ఆలయ ప్రధాన అర్చకుడి సస్పెన్షన్‌ .. కోడలిపై లైంగికదాడి వ్యవహారంలో చర్యలు

కుమారుడిని కూడా సస్పెండ్ చేసిన ఈవో

అమ్మన్యూస్, భద్రాచలం : భద్రాచలం ఆలయ ప్రధాన అర్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులు, ఆయన కుమారుడు వెంకట సీతారంను ఆలయ ఈవో సస్పెండ్ చేశారు. వారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావటంతో అర్చకత్వం నుంచి తప్పించారు. తనను లైంగికంగా వేధిస్తున్నారని సీతారామానుజాచార్యులు కోడలు పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టడంతో దేవాదాయశాఖ అధికారులు చర్యలకు దిగింది.

పోలీసులు, బాధితురాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. పొడిచేటి సీతారామానుజాచార్యులు భద్రాచలం ఆలయ ప్రధానార్చకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు సంతానంగా కుమార్తెలు మాత్రమే ఉండడంతో.. వెంకట సీతారాంను కొన్నేళ్ల కిందట దత్తత తీసుకున్నాడు. అనంతరం భద్రాచలం ఆలయ అర్చకుడిగా ఉద్యోగం ఇప్పించాడు. వెంకట సీతారాంకు ఏపీలోని తాడేపల్లిగూడెంకు చెందిన యువతితో 2019లో పెళ్లి జరిగింది. వివాహం జరిగిన కొన్ని నెలలకే సీతారాం వరకట్నం తేవాలని భార్యను వేధింపులకు గురి చేయటం మెుదలుపెట్టాడు. ఆ తర్వాత.. మామ సీతారామానుజాచార్యులు ఆమెపై కన్నేశాడు. తనకు కుమారులు లేరని.. తన పోలికలతో ఒక బాబు కావాలని కోడలిపై సీతారామానుజాచార్యులు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన భర్తకు చెప్పగా వినిపించుకోలేదు.

సీతారామానుజాచార్యులు అలాంటి వాడు కాదని, రివర్స్‌లో భార్యతోనే తండ్రికి క్షమాపణ చెప్పించాడు. దీంతో బాధితురాలు ఈ ఏడాది ఆగస్టులో తాడేపల్లిగూడెం పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టింది. తన మామ సీతారామానుజాచార్యులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని.. అత్త, భర్త, ఇతర కుటుంబ సభ్యులు తనను రూ.10 లక్షల కోసం వేధించారని ఆగస్టు 14న ఫిర్యాదు చేసింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా తాజాగా ఎండోమెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు భద్రాద్రి దేవస్థానం ఈవో రమాదేవి ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులు, ఆయన దత్తపుత్రుడు వెంకట సీతారాం ఇద్దరిని సస్పెండ్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆలయ ప్రధాన అర్చకుడు, ఆయన కుమారుడు లైంగిక, వరకట్న వేధింపుల వ్యవహారంలో సస్పెండ్ కావటం చర్చకు దారి తీసింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10